Aditya Singh Rajput: బాలీవుడ్​ న‌టుడు అనుమానాస్పద మృతి!

Mumbai: బాలీవుడ్‌(Bollywood) యంగ్​ హీరో ఆదిత్య సింగ్ రాజ్‌పుత్(Aditya Singh Rajput) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆదిత్య మోడ‌ల్‌, కాస్టింగ్ కో-ఆర్డినేటర్ గానూ రాణించారు. ముంబైలోని అంధేరీలో నివాసం ఉంటున్న ఆదిత్య త‌న ఇంట్లోని వాష్‌రూమ్‌లో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించారు. వెంట‌నే అత‌డి స్నేహితుడు వాచ్‌మెన్ సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆదిత్య మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీకరించారు.

డ్ర‌గ్స్‌ ఓవ‌ర్ డోస్ కార‌ణంగానే ఆదిత్య చనిపోయి ఉంటాడ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆదిత్య మ‌ర‌ణం ఇండ‌స్ట్రీలో విషాదం నింపింది. ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ మోడ‌ల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ త‌రువాత న‌టుడిగా మారి.. ‘క్రాంతివీర్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’ సినిమాల్లో న‌టించి త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 300 పైగా యాడ్స్‌లో న‌టించి పాపులర్​ మోడల్​గా పేరు తెచ్చుకున్నాడు.

‘స్ల్పిట్స్ విల్లా 9’ వంటి రియాలిటీ షోలోనూ పాల్గొన్నాడు. ‘ఆషికీ’, ‘కోడ్ రెడ్’, ‘ఆవాజ్ సీజన్ 9’ వంటి టీవీ షాల్లోనూ అలరించాడు. చాలా మంది కొత్త‌ నటులను ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేశారు. 32 ఏళ్ల ఆదిత్య మరణంతో బాలీవుడ్​లో విషాదం నెలకొంది. పలు సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​(Sushanth Singh Rajput) మరణించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. ఇప్పుడు మరో యంగ్​ హీరో మరణం పలు అనుమానాలకు తావిస్తోంది.