Karnataka: CM అప్పుల చిట్టా విప్పిన టీచ‌ర్.. స‌స్పెండ్

Bangalore: ఇటీవలే కర్ణాటక(Karnataka) రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే కాంగ్రెస్​ ఇచ్చిన 5 హామీల ఫైలుపై తొలి సంతకం చేసి పరిపాలన ప్రారంభించారు సిద్ధరామాయ్య. కాగా సిద్దరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ షేర్​ చేశాడు. సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ శాంతమూర్తి(Shantha Murthy) అనే టీచర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

చిత్రదుర్గంలోని హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచిత పథకాలపైనా విమర్శలు గుప్పించారు.‘ఒకప్పుడు రైట్ వింగ్ గా భావించే కర్ణాటక కొత్త సీఎం సిద్ధరామయ్య పాత యుద్ధ గుర్రం. ఫ్రీబీస్ ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అని శాంతమూర్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన పోస్ట్‌లో పాఠశాల ఉపాధ్యాయుడు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో చేసిన అప్పును పేర్కొన్నాడు. దీనిపై శాంతమూర్తిని సస్పెండ్ చేస్తూ క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్‌.జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.