GIS 2023: 2 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వస్తాయ‌ని అంచ‌నా

విశాఖ‌ప‌ట్నంలో నేడు, రేపు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివ‌ర్సిటీ ఈ స‌ద‌స్సుకు వేదిక కానుంది. ఈ స‌ద‌స్సు నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌దస్సును ప్రారంభించారు. దేశ విదేశాల‌కు చెందిన పెట్టుబ‌డిదారులు, పారిశ్రామిక‌వేత్త‌లు, వివిధ దేశాల రాయ‌బారులు, వాణిజ్య ప్ర‌తినిధులు 8-10 వేల మంది వ‌ర‌కు హాజ‌రవుతారని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్, ఆయ‌న స‌తీమ‌ణి గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. స‌ద‌స్సులో మొత్తం రూ. 2 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు జ‌రుగుతాయ‌ని మంత్రులు చెబుతున్నారు. ఎక్కువ మందికి ఉపాధి క‌ల్పించే, త‌క్కువ స‌మ‌యంలో పెట్టుబ‌డుల ప్ర‌తిపాద‌న‌ల్ని కార్య‌రూపంలోకి తెచ్చే సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక రాయితీలు ఇస్తామ‌ని అంటున్నారు. ఈరోజు ఉద‌యం 10 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత వివిధ పారిశ్రామిక‌, వాణిజ్య సంస్థ‌లు, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు 118 స్టాల్స్‌తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిష‌న్‌ను సీఎం జ‌గ‌న్, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్రారంభిస్తారు. భోజ‌న విరామం త‌ర్వాత మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5.50 వ‌ర‌కు ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, పారిశ్రామిక ర‌వాణా మౌలిక వ‌స‌తులు ఇత‌ర వాటి గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. రాష్ట్రంలో పెట్టుబ‌డుల ఒప్పందాల‌పై సంత‌కాలు చేస్తారు.

ఈరోజు స‌ద‌స్సు అయిపోయాక సాగ‌ర తీరంలోని ఎంజీఎం పార్కులో పారిశ్రామిక, వాణిజ్య ప్ర‌ముఖుల‌కు సీఎం జ‌గ‌న్ విందు ఇస్తారు.ఇక రెండో రోజు స‌ద‌స్సులో ఉద‌యం 9.30 నుంచి 10.30 వ‌ర‌కు పెట్టుబ‌డుల‌పై ఒప్పందాలు జ‌రుగుతాయి. పెట్రోలియం, దుస్తులు, మందులు, లైఫ్‌సైన్స్ రంగాల్లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌పై చర్చ‌లు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత ముగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌దస్సు ముగుస్తుంది. ఈ స‌ద‌స్సు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం విస్రృతంగా ఏర్పాట్లు చేసింది. ఐదు భారీ హాళ్లు ఏర్పాటుచేసింది. మూడో నెంబ‌రు హాల్‌లో ముగింపు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. 2000 మందికి పైగా కూర్చునేలా అందులో ఏర్పాట్లు చేసారు. మొద‌టి హాలును పూర్తిగా అతిథుల భోజ‌నాల కోసం కేటాయించారు. ఒకేసారి 700 మంది భోజ‌నాలు చేసేలా ఏర్పాట్లు జ‌రిగాయి. ఇకపోతే విద్యార్థులు కూడా ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు భారీ మొత్తంలో రిజిస్ట్రేష‌న్లు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. గురువారం మ‌ధ్యాహ్నానికే 14వేల మంది పేర్లు న‌మోదు చేసుకున్నార‌ని టాక్. స‌ద‌స్సుకు వ‌చ్చే పారిశ్రామికవేత్త‌ల‌కు విమానాశ్ర‌యంలో స్వాగతం ప‌లికి , స‌ద‌స్సు ప్రాంగ‌ణానికి తీసుకువెళ్ల‌డానికి ప్ర‌త్యేక స్టాఫ్‌ను ఏర్పాటుచేసారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఐదుగురు జిల్లా స్థాయి అధికారుల‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించింది. పారిశ్రామిక‌వేత్త‌ల్లో కొంద‌రు ప్ర‌త్యేక విమానాల్లో వ‌స్తున్నారు. వారి కోసం ప్ర‌త్యేకంగా ఖ‌రీదైన కార్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. వారు బస చేసేందుకు 17 ప్ర‌ముఖ హోట‌ళ్ల‌లోని 550 గ‌దులు సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.