YS Sharmila: మాటిస్తే తలనరుక్కునే సీఎంకు ఈ దమ్ముందా?
Hyderabad: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు(telangana cm kcr)పై వైఎస్‌ఆర్‌టీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila) ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించకుండా.. మహారాష్ట్ర రైతులను అసెంబ్లీకి పంపిస్తానంటూ.. కేసీఆర్ గప్పాలు కొడుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ సందర్బంగా ఆమె ఇలా మాట్లాడారు.. ”తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డాడు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు కేసీఆర్ ఇచ్చాడు.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతుండు పెద్ద దొర” అని షర్మిల మండిపడ్డారు. మాట ఇస్తే తలనరుక్కునే సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున రైతులు పోటీ చేసే అవకాశం కల్పిస్తారా.. ఆయనకు ఈ దమ్ముందా అంటూ వైఎస్ షర్మిల చురకలంటించారు.
”మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేళ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా?” అని ప్రశ్నించారు. పంట బీమా కూడా రైతులకు ఇవ్వట్లేదని.. పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడమా అని షర్మిలా కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, తమది నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల బీఆర్‌ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వాలని ఆమె కోరింది. బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు దోచిపెట్టడం, ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడం, కనీసం కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డునపడేస్తున్నారని.. కౌలు రైతు.. రైతే కాదని చెబుతూ.. వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడం కేసీఆర్ సాగిస్తున్న అరాచక పరిపాలనకు నిదర్శమని షర్మిల ఆరోపించారు.