కేసీఆర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేద్దాం – వైఎస్‌ షర్మిల

తెలంగాణ సమాజం ఈ రోజున దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. నోరు విప్పితే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్బంగా విపక్షపార్టీలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె ఏమని పేర్కొన్నారంటే.. ‘పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్యను మీతో చర్చించాలనుకుంటున్నాను. అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు పాలనలో వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోంది’ అని లేఖలో తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో, రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచేస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె ఆరోపించారు.

ప్రజల పక్కన నిలబడినందుకు ప్రతిపక్షాలపై కేసులా..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసులు మోపుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. రాక్షసత్వంతో పోలీసుల్ని పురిగొల్పి, వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ ఆసుపత్రిపాలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజున నోరు తెరవటానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని.. శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలకు సైతం అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై వేధింపులేంటని.. కేసీఆర్ రాక్షసపాలనకు వ్యతిరేకంగా జైళ్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అందుకు జెండాలను పక్కన పెట్టి, అన్ని పార్టీలు ఒక్కటై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విపక్షాలకు ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందని.. ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మలి విడతలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాలని.. అందుకు అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు.