సుస్మితా సేన్‌కు గుండెపోటు

మాజీ విశ్వ‌ సుంద‌రి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు. ఈ విష‌యాన్ని ఆవిడే స్వ‌యంగా సోషల్‌మీడియా ద్వారా ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్, నెటిజ‌న్లు షాక్‌కు గుర‌య్యారు. “కొన్ని రోజుల క్రితం నాకు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే కార్డియాల‌జిస్ట్ ఏంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసారు. నా గుండె చాలా గ‌ట్టిది అని కార్డియాల‌జిస్ట్ చెప్ప‌డంతో ధైర్యం వ‌చ్చింది. మ‌న గుండెని ధైర్యంగా, ఆనందంగా ఉంచుకున్న‌ప్పుడే అవ‌స‌రంలో అది మ‌న‌కు తోడుగా నిలుస్తుంది అని మా నాన్న చెప్తుండేవారు. ఇప్పుడు నా ఆరోగ్యం విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఈ విష‌యం ఎందుకు చెప్తున్నానంటే.. ఫ్యాన్స్, నెటిజ‌న్లు ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని, ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడ‌ద‌ని మీతో ఈ విష‌యాన్ని పంచుకుంటున్నాను”అని వెల్ల‌డించారు.ఈ మ‌ధ్య‌కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల నటుడు నంద‌మూరి తార‌క ర‌త్న మ‌ర‌ణం దిగ్ర్భాంతికి గురిచేసింది. మంచి ఆహారం తింటూ, శారీర‌క వ్యాయామం చేసేవారికి కూడా గుండెపోటు రావ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. సుస్మిత సేన్ యోగా, జిమ్ క్ర‌మం తప్ప‌కుండా చేస్తుంటారు. అలాంటి ఆమెకు కూడా గుండెపోటు రావ‌డం ఏంటి అంటూ నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

సెలబ్రిటీల్లోనే కాకుండా.. ఇటీవ‌ల రెండు వారాల్లో దాదాపు ఆరుగురు వ్య‌క్తులు గుండెపోటుతో చ‌నిపోయారు. గ‌త వారం 24 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ జిమ్‌లో వర్క‌వుట్ చేస్తూ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయాడు. తోటి వారు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అత‌ను అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టిరోజే ఓ వ్య‌క్తి గుండెపోటుతో స్పృహ‌కోల్పోవ‌డంతో ఓ ట్రాఫిక్ పోలీసు అత‌నికి సీపీఆర్ చేసి వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ను కోలుకుంటున్నాడు. ఆ మ‌రుస‌టి రోజే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జిమ్‌లో ఫిట్స్ వ‌చ్చి పడిపోయి ఆ త‌ర్వాత గుండెపోటుతో మ‌ర‌ణించిన వార్త షాక్‌కు గురిచేసింది. మూడు రోజుల క్రితం ప్ర‌ముఖ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ అభిమాని ఒక‌రు గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండ‌గా గుండెపోటుతో చ‌నిపోయాడు. దాంతో ధ‌ర‌మ్ తేజ్ అత‌ని మృతికి సంతాపం తెలుపుతూ తాను న‌టించిన విరూపాక్ష సినిమా టీజ‌ర్ లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఇలా ఎన్నో గుండెపోటు మ‌ర‌ణాలు ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌ల‌కు గురిచేస్తున్నాయి.