KCR: ఇప్ప‌టికిప్పుడు ఎల‌క్ష‌న్ పెట్టినా 105 సీట్లు ప‌క్కా

Hyderabad: BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఇవాళ తెలంగాణ భవన్ లో సీఎం కెసిఆర్(kcr) అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల నుంచి జిల్లా అధ్యక్షులు, పార్టీ కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది చెప్పుకుంటే చాలూ. ఏం చేశామో జనాలకు చెప్పండి. గెలుపు మనదే అవుతుంది. రైతులను చెరువుల దగ్గరికి పిలిచి మీటింగ్‌ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి. సరిపోతుంది. అని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

“గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. అందుకే వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు BRS కు వస్తాయని” కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడంపైనా చర్చించారు. మంత్రులు ఆయా జిల్లాలలో ఉత్సవాలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ కేడ‌ర్‌ అందరికి సీట్లు ఇస్తానని చెప్పారు. ఈసారి మాత్రం గతంలో లాగా ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అన్న విషయాలను సీఎం ప్రస్థావించలేదు. ఈ సమావేశం ప్రధానంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో పార్టీ నాయకులు, కేడర్ ను వాటి నుంచి బయటకు తెచ్చేందుకు 20 రోజుల వ్యవధిలోనే రెండో సారి కెసిఆర్ నాయకులతో భేటీ అయ్యారు. దీనితో పాటు.. రానున్న ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్, అభివృద్ధి, పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఆ విషయాన్నే కేడరకు కూడా చెప్పినట్టు సమాచారం.