The Kerala Story: సుప్రీంలో విచారణ నేడే!
Delhi: విడుదలకు ముందు నుంచే పలు వివాదాలను ఎదుర్కొంటున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). అదా శర్మ(Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా ఎన్ని ఫిటిషన్లు ఫైల్ అయినా పలు రాష్ట్రాల్లో విడుదల చేశారు మేకర్స్. మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందనతోపాటు భారీ కలెక్షన్లను కూడా రాబడుతోంది. ఈ చిత్రం విడుదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం విచారణ జరుపనుంది. సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గతవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. మంగళవారం (మే 16) విచారించేందుకు జాబితా చేసింది. జరల్నిస్ట్ కుర్బన్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని.. పిటిషన్పై తక్షణ విచారణ అవసరమని సిబల్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరుగనుండగా.. వివాదాస్పద చిత్రంపై సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే, సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారించిన సమయంలో కేరళ హైకోర్టు మే 5న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కళాత్మక స్వేచ్ఛ గురించి నొక్కి చెబుతూ.. సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ వివాదాస్పద చిత్రంపై పలు రాష్ట్రాలు ప్రదర్శనపై బ్యాన్ విధించగా.. చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో సినిమాను బ్యాన్ చేయగా.. తమిళనాడులో ప్రదర్శనను నిలిపివేశారు. బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాగా, ఈ రోజు జరగనున్న విచారణలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.