Viral News: వీధి కుక్కలకు అన్నం పెట్టిందని చితకబాదారు!

Mumbai: వీధి కుక్కలకు(Street dogs) ఆహారం(Food), నీళ్లు(Water) పెట్టడం కొందరికి అలవాటు. పట్టణాలు, నగరాల్లో చాలామంది మహిళలు ఉదయాన్నే వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ కనపడతారు.  కొన్ని ఎన్జీవో(NGO)లు కూడా ఈ పని చేస్తుంటాయి. మూగ జీవాలంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయకపోయినా చేసేవాళ్లను చూసి హర్షిస్తారు. కానీ అదే పని ఓ వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చింది. ముంబైలో ఓ వృద్ధురాలు ఇలానే ఆకలితో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టేది. అయితే, ఆ జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.

ముంబైలోని మీరా రోడ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న షెర్లిన్ స్మిత్(61) అనే వృద్ధురాలిపై దాడి జరిగింది. మీరా రోడ్ లోని లక్ష్మీ పార్క్ ప్రాంతంలోని వాసుదేవ్ ప్లానెట్ కాంప్లెక్స్ వాసులు.. షెర్లిన్ తో గొడవ పెట్టుకున్నారు. కుక్కలకు ఆహారం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ముగ్గురు మహిళలు కలిసి.. షెర్లిన్​ని దారుణంగా కొట్టారు. ఆమె వయసుకైనా గౌరవం ఇవ్వకుండా బూతులు తిడుతూ చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.