బొమ్మ గీసి అమ్మపై ప్రేమ చాటుకున్న బ్రహ్మానందం!
Hyderabad: మే 14వ తేదీ మదర్స్ డే (Mother’s Day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ తల్లులతో గల అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ కూడా తమ తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ వారితో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కాగా, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) కూడా తల్లిపై ప్రేమని ఓ బొమ్మ గీసి చూపించారు.
సినిమాల్లో బ్రహ్మి కామెడీ ఎంత బాగా చేస్తారో.. పేపర్ పై చిత్రాలను కూడా అంత బాగా గీస్తారు.
ఆ చిత్రాలను బ్రహ్మానందం కొడుకు రాజగౌతమ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాలను చెక్కిన బ్రహ్మానందం.. మదర్స్ డే సందర్భంగా తన తల్లి చిత్రాన్ని అద్భుతంగా గీశారు. ‘జన్మనిచ్చిన తల్లికి ప్రేమతో.. బ్రహ్మానందం’ అని ఫొటో కింద వ్యాఖ్య జోడించారు. ఆ ఫోటోని గౌతమ్ షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. కాగా, బ్రహ్మానందం కొంత కాలం నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు. నిన్న మొన్నటి వరకు కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాలో తన నటనతో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృషవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ (Rangamarthanda) ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలోని కీలకపాత్రలో నటించారు బ్రహ్మానందం. బ్రహ్మానందం నటనకు ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ సైతం ఫిదా అయిపోయారు. చిరంజీవి, రాం చరణ్ కుటుంబ సమేతంగా బ్రహ్మానందాన్ని కలిసి సన్మానించారు అంటే ఆయన నటన ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.