pawan kalyan సీఎం పదవి వద్దనడంలో అదే వ్యూహం.. ఫుల్‌ క్లారిటీతోనే!

vijayawada: జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌(janasena chief pavan kalyan) ప్రతి మీటింగ్‌లో వినపడే ఒకేఒక్క మాట సీఎం, సీఎం.. ఆయన్ని అభిమానించే వారు.. ఆ పార్టీ కేడర్‌ తో సహా.. అందరూ పవన్ సీఎంగా చూడాలని భావిస్తున్నారు. కానీ ఇవన్నీ పవన్ని చూసిన ఉత్సాహంలోనో, సోషల్‌మీడియాలో పోస్టుల రూపంలోనే వాస్తవ రూపం దాల్చుతున్నాయి. క్షేత్రస్తాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడట్లేదు. దీంతో పవన్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తన బలాన్ని అతిగా అంచనా వేసుకోలేనని ఇటీవల ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నానని, వాటి నుంచి ఇప్పటికైనా బయటపడాలని సమాలోచన చేస్తున్నారు. ఎందుకంటే.. ఈసారి పవన్‌ కల్యాణ్‌ గెలవకపోతే మాత్రం ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుంది. అందుకే ప్రయోగాలు చేయనని ఇటీవల పలుమార్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే బరిలో దిగుతామని అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ తన వ్యాఖ్యలను ప్రత్యర్థిపార్టీలు ఏవిధంగా అయినా వక్రీకరించని.. ఆయన మాత్రం వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఊరికే సీఎం సీఎం అని అరిస్తే పదవి రాదని.. ప్రజల్లోకి జనసేన భావజాలాన్ని తీసుకెళ్లాలని, అలా ఓట్లు రాబట్టుకోవాలని పవన్‌ చెబుతున్నారు. ఇక సీఎం పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఒక్క సీటు కూడా లేని పార్టీకి సీఎం సీటు ఏవిధంగా ఇస్తారు? రానున్న ఎన్నికల్లో జనసేన బలం పుంజుకుంటే అప్పుడు కుర్చీ కోసం ఫైట్‌ చేయవచ్చని చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్ష కూటములు కలిసి రావాలని కోరారు. జగన్‌ వ్యతిరేకంగా కూటమి ఎందుకు ఏర్పడుతోందో కూడా.. ప్రజలకు తెలిసేలా.. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించడమే కాకుండా.. ఎందుకు ఓడించాలని అనుకుంటున్నారో ప్రజలకు కూడా తెలియజేయనున్నారు. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో ప్రాక్టికాలిటీతో పవన్‌ మాట్లాడారు. దీంతో ఇప్పటి వరకు పవన్‌ సీఎం కావాలనుకున్న కొందరి కోరిక మాత్రం అడియాసలాగే మారే పరిస్థితి ఉంది.