Karnataka Elections: BJP ఓటమికి కారణాలు ఇవే..!
Bengaluru: ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా 20 సార్లు రాష్ట్రంలో పర్యటించినా అధికార పార్టీపై(bjp) ఓటర్లు కరుణ చూపలేదు. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈసారి కోల్పోయింది. బీజేపీ ఓటమికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం…
అగ్రనాయకులను పక్కనబెట్టడం
ఎన్నికల సమయంలో పేరున్న నాయకులను బీజేపీ హైకమాండ్ పక్కనబెట్టింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ సీఎం యడ్యూరప్పను ప్రచారంలో ఉపయోగించుకోలేదు. మాజీ సీఎం జగదీష్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ తదితరులకు టికెట్ నిరాకరించారు. దీంతో ఆ ఇద్దరూ కాంగ్రెస్ గూటికి చేరారు. యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాదీలు లింగాయత్ వర్గానికి చెందిన వారు. ఆ వర్గానికి చెందిన ముగ్గురు నాయకులను పక్కనబెట్టడం BJPని ఓటమికి మరింత చేరువ చేసింది.
లింగాయత్‌లు దూరం
బీజేపీ అనేక హామీలు ఇచ్చినా ఓటర్లు మాత్రం నమ్మలేదు. ఏండ్లుగా వస్తున్న సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలోనూ ఆ పార్టీ విఫమైంది. ముఖ్యంగా యడ్యూరప్ప విషయంలో పార్టీ వైఖరి లింగాయత్ లకు మండింది. కర్ణాటకలోని 224 సీట్లలో లింగాయత్ సామాజిక వర్గానికి దాదాపు 70 సీట్లలో పట్టుంది. మరో 30 సీట్లలో గెలుపు ఓటములను శాసించగలిగే స్థాయిలో వీరికి ఓట్లు ఉన్నాయి.
లింగాయత్ లలో యడ్యూరప్పకు అతిపెద్ద నాయకుడిగా పేరుంది. 2021 జులైలో బీజేపీ ఆయనను బలవంతంగా సీఎం పదవి నుంచి తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైను సీఎం పీఠం ఎక్కించింది. ఆయితే బొమ్మైకు ఆ సామాజికవర్గంపై అంత పట్టులేకపోవడం బీజేపీకి మైనస్ అయింది. ఇక దళితులు, ఆదివాసీలు, ఓబీసీ, వక్కలింగా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ విఫలమైంది. ఇదే సమయంలో ముస్లింలు, దళితులు, ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. లింగాయత్ ల ఓట్లను కొల్లగొట్టడంలోనూ కొంత మేర విజయం సాధించింది.
అవినీతి ఆరోపణలు
కర్నాటకలో అధికార బీజేపీకి ఓటర్లు మద్దతు తెలపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడటం ఆ పార్టీకి మైనస్ గా మారింది. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ది జరగకపోవడం, నిరుద్యోగం తదితర కారణాలు బీజేపీని ఓటమి అంచున నిలబెట్టాయి. బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, జేడీఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయయ్యాయి. బీజేపీ హిందుత్వం, రిజర్వేషన్ల అంశంతో ఓట్లు రాబట్టుకోవాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. హిందూ, ముస్లింల మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం ఎదురుతన్నిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మైనార్టీ ఓటు బ్యాంకు దూరం
బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కారు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించింది. దీనికి తోడు ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని ప్రచారంలో యడ్యూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు తెగేసి చెప్పారు. ఈ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు 13శాతం ఉన్నారు. హిజాబ్, హలాల్ కట్, అజాన్, గోవధ నిషేధ చట్టం, ముస్లిం 2బీ రిజర్వేషన్ల రద్దు, టిప్పు సుల్తాన్ వంటి అంశాలు మైనార్టీలకు బీజేపీకి పూర్తిగా దూరం చేశాయి.
40శాతం కమిషన్ ఆరోపణలు
అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి. కర్నాటక కాంట్రాక్ట్ అసోసియేషన్ నేరుగా పబ్లిక్ ప్రాజెక్టుల్లో 40శాతం కమిషన్ తీసుకొంటోందంటూ బహిరంగ లేఖ విడుదల చేసింది. బాధితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నారు. 2021లో ఈ సంఘం కర్ణాటకలో అవినీతిపై ప్రధాని మోడీకి లేఖ రాసినా ఎలాంటి చర్యలు లేవు. తాజాగా అలాంటి ఆరోపణలే ఎన్నికలకు ఒక్క రోజు ముందు చేయడం ఓటర్లపై కొంత ప్రభావం చూపింది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చేపట్టిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు కూడా పార్టీని బాగా దెబ్బతీసింది.
యాంటీ బీజేపీ స్లోగన్
కర్నాటక ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారనే దానికన్నా బీజేపీ వ్యతిరేకతే ఎక్కువ కనిపించింది. వాస్తవానికి కర్నాటకలో ఒకసారి గెలుపొందిన పార్టీని మరోసారి అక్కడి ప్రజలు ఎన్నుకోరు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది. అనేక మందికి కొత్తవారికి సీట్లు కేటాయించడం కమలదళానికి కలిసిరాలేదు. ప్రభుత్వ బాధిత వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా కసితో పనిచేఛాజవ. దీంతో సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టిన బీజేపీ ఉచితాలు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది.