Bandla Ganesh: రాజకీయాలపై త్వరలో ప్రకటన
Hyderabad: పలు సినిమాలో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్(Bandla Ganesh). నిర్మాతగా మారి సూపర్ హిట్లు కొట్టి బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో వైరల్ అయ్యారు బండ్ల. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బండ్ల్ గణేష్ కూడా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్ల ప్రస్తుతం అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు దూరంగా ఉన్నారు.
గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్(Congress) లో చేరిన బండ్ల గణేష్ కొన్ని అనివార్య కారణాలతో కొన్నాళ్లకే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు. కానీ తాజాగా రాజకీయాలపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.
‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ బండ్ల గణేష్ ట్వీట్స్ వైరల్గా మారాయి. మరి బండ్ల గణేష్ ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారో తెలియాలంటే మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!