మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. సామాన్యుడిపై ‘బండ’ బాదుడు!
నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. వంట గ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 50, వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 350.50 పెంచినట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ. 1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ. 1,155కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,103కు పెరగ్గా వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,119.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 25 పెరిగింది.
ఒకటో తేదీనే పెట్రోలియం సంస్థలు పెద్ద ఝలక్ ఇచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. గృహ వినియోగానికి ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ సహా.. వాణిజ్య వినియోగానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. ఇక, కమర్షియల్ సిలిండర్ ధర 19 కేజీలకు ఏకంగా రూ.350.50 పెరిగింది. దీంతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ రేటు రూ.2119.50కి ఎగబాకింది. ఇది ఇంతకుముందు రూ.1769 వద్ద ఉండేది. ఇక కోల్‌కతాలో రూ.1870 నుంచి ఏకంగా రూ.2221.50కి పెరిగింది. ముంబయిలో 19 కేజీలో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.2071.50కి చేరింది. చెన్నైలో ఇది రూ.2268కి చేరింది. ఈ పెరిగిన రేట్లు కూడా మార్చి 1వ తేదీనే అమల్లోకి వస్తున్నట్లు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి.
ఇక గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే స్థానిక పన్నులను బట్టి ఇవి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఈ రేట్లను ఫ్యూయల్ రిటైలర్స్ సవరిస్తుంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఇక ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం ప్రజలకు ఉజ్వల పథకంలో చేరిన వారికి, అంటే ఆ లబ్ధిదారులకు రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీనిని బడ్జెట్‌లోనూ పొందుపరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి తేనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది జనం లబ్ధి పొందనున్నారు. రూ.500కు అంటే దాదాపు సగానికి సగం రేటు తగ్గనుందన్నమాట. ఇక ఏడాదికి 12 గ్యాస సిలిండర్లు ఇస్తామని వెల్లడించింది. దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ రేటు రూ. 1103కు చేరింది. ఇప్పటివరకు ఇది 14.2 కేజీలకు రూ.1053గానే ఉండేది. ముంబయిలో ఈ గ్యాస్ సిలిండర్ రేటు రూ.1052.50 నుంచి రూ.1102.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ. 1129 వసూలు చేయనున్నారు. చెన్నైలో సిలిండర్ ధర రూ.1118.50కి చేరింది. ఇప్పటికే నిత్యావసర రేట్ల పెరుగుదలకు తోడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.