తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వచ్చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భద్రతా చర్యల్లో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తులను ముఖ గుర్తింపు సాంకేతికత(ఫేస్ రికగ్నిషన్) ద్వారా స్వామి సర్వదర్శనానికి, ఇతర కౌంటర్లకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించిన టీటీడీ.. మార్చి 1వ తేదీ(బుధవారం) నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అసలు ఈ సాంకేతికతను ఎందుకు తీసుకొచ్చారు. దీని వల్ల భక్తులకు కలిగే లాభ నష్టాల గురించి తెలుసుకుందామా…
దళారీ వ్యవస్థను తగ్గించేందుకు… పారదర్శకత పెంచేందుకు..
తిరుమలలో రోజు రోజుకీ పెరిగిపోతున్న దళారీ వ్యవస్థల వల్ల భక్తులు అనేక విధాలుగా మోసపోతూ.. డబ్బులు కూడా నష్టపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికత ఉపయోగపడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు భక్తులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, సర్వదర్శనం (ఉచిత దర్శనం) కౌంటర్లు, వసతి కేంద్రాల వద్ద ప్రవేశపెట్టారు. ఈ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత మిగిలిన కౌంటర్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
నెలకు ఒకసారి మాత్రమే స్వామి దర్శనం..
కొత్త తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత అనంతరం.. ఇకపై ఒక్కో భక్తుడు నెలకు ఒకేసారి మాత్రమే తిరుమలలో రూమ్ బుక్ చేసుకునేలా టీటీడీ చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు భక్తులను నెలకు ఒకసారి మాత్రమే స్వామి వారి ఉచిత దర్శనానికి అనుమతిస్తారని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని.. నెలలో ఒకసారి మాత్రమే.. స్వామి వారిని దర్శించుకోవాలని.. అంతకు మించి తిరుమలకు వస్తే.. వెనక్కు పంపించేస్తామని వారు అధికారులు చెబుతున్నారు. అద్దె గదులు పొందే సమయంలో కొందరు మధ్యవర్తులు లేదా అక్కడి నిర్వాహకులు అధిక రేట్లకు విక్రయించే వీలు లేకుండా ఈ నూతన సాంకేతిక విధానం ఉపయోగపడుతుందని టీటీడీ అధికారులు అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తుడి చిత్రాలను ఎప్పటి కప్పుడు నమోదు చేస్తారని తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం తదితర అంశాల్లో మరింత పారదర్శకత రానున్న రోజుల్లో పెరుగుతుందని టీటీడీ సిబ్బంది చెబుతున్నారు.