Kanguva: సూర్య మేకోవర్ చూస్తే మతి పోవాల్సిందే!
Chennai: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’(Kanguva). విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే సూర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. సూర్య 42వ సినిమాగా భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి కంగువ సినిమాతో ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం సూర్య మేకోవర్ చూస్తుంటే సినిమా కూడా ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థమవుతోంది.
సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘కంగువ’ అనే టైటిల్‌ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఇప్పటికే కంగువ టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్(Bollywood) హాట్ బ్యూటీ దిశాపటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇక తాజాగా సూర్య ఎక్సర్సైజ్ చేస్తున్న ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం సూర్య మేకోవర్ చూస్తే ఔరా అనాల్సిందే. కండలు తిరిగిన దేహంతో.. యుద్ధానికి సిద్దమవుతున్న వీరుడిలా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు సూర్య. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే సూర్య, కంగువ కోసం వెయిట్ పెరిగి బల్కీ షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది.