JDS కింగ్‌మేకర్‌ అవుతుందా? కుమారస్వామి సింగపూర్‌లో బిజిబిజీ!

Bengaluru: కర్నాటకలో మరోసారి హంగ్‌ అసెంబ్లీ(karnataka elections) వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. దీంతో కింగ్‌ మేకర్‌గా మారేందుకు JDS నాయకత్వం పావులు కదుపుదోంది. మే 13వ తేదీన కర్నాటక ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి కూడా జేడీ(ఎస్ ) కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా ఇదే విషయం స్పష్టమైంది. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే కాంగ్రెస్ తో పాటు బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని జేడీ(ఎస్) నాయకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం తమ పార్టీ కింగ్ మేకర్ గా ఉంటుందని ధీమాగా ఉన్నారు.

కర్నాటక ఫలితాలు విడుదలవుతున్న వేళ.. కుమార స్వామి.. సింగపూర్‌లో ఉన్నారు. దీంతో కింగ్‌ మేకర్‌ అంశంపై ఆ పార్టీ నుంచి ఎవరూ బహిరంగంగా మాట్లాడట్లేదు. కుమార స్వామి వచ్చిన తర్వాతే.. ఏ పార్టీతో జట్టు కట్టాలనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని జేడీఎస్‌ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ తెలిపారు. ఇక జేడీ(ఎస్) నేతల వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. తాము ఇప్పటి వరకూ జేడీ(ఎస్) నాయకులను సంప్రదించలేదని చెబుతోంది. తాము స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తామని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి హెల్త్ చెకప్ కోసం మే 11వ తేదీన సింగపూర్ వెళ్లారు. కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారాలతో కొంత అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సింగపూర్ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన శనివారం (మే 13వ తేదీ) సాయంత్రానికి కర్నాటకకు చేరుకోనున్నారు. ఇక అదే రోజు ఫలితాలు విడుదలవుతున్నాయి.