Karnataka Elections: బీజేపీ కానుకలను తిరిగిచ్చేసిన ఓటర్లు
Bengaluru: తమ పార్టీకే ఓటేయాలంటూ కానుకలు ఇచ్చిన బీజేపీకి(bjp) ఓ గ్రామం గట్టిగా బుద్ధిచెప్పింది. కర్ణాటకలో నిన్న పోలింగ్(karnataka elections) జరిగిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా మంగళవారం కేఆర్ పేట నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత.. ఆ ప్రాంత ప్రజలకు చీరలు, కోళ్లు కానుకలుగా ఇచ్చి తమకే ఓటు వేయాలని కోరారు. ఈ విషయం కాంగ్రెస్ వర్గాలకు తెలిసి వారిని ప్రశ్నించేందుకు వెళ్లారు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. ఓటెయ్యడానికి ముందు.. కానుకలు తీసుకున్న ప్రజలు వాటిని తిరిగి ఆ బీజేపీ నేత గుమ్మం ముందు పెట్టేసారు. సిగ్గుండాలి.. మమ్మల్ని ఈ కానుకలతో మాయ చేయాలని చూడకండి. మాకు నచ్చినవారికే ఓటు వేస్తాం అంటూ ఆందోళన చేపట్టారు. అయితే ఈ విషయం గురించి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అయితే కేఆర్ పేట ప్రాంతానికి చెందిన ఓ అడ్వొకేట్ మీడియాతో అసలు విషయం చెప్పారు.
“నారాయణ గౌడ అనే బీజేపీ నేత కేఆర్ పేటలోని గంజిగెరె గ్రామంలో ఉంటున్న ఎస్సీలకు కానుకలు ఇవ్వడానికి వర్కర్లను పంపించారు. చీరలు, కోళ్లు, డబ్బులు తీసుకొచ్చారు. కానీ ప్రజలు గ్రామ ప్రజలు వాటిని వద్దని వెనక్కి పంపేసారు. బుధవారం ఉదయం లేచి చూడగానే ఆ కానుకలు వారి ఇళ్ల ముందు పెట్టి ఉన్నాయి. దాంతో ప్రజలు వాటిని తీసుకెళ్లి నారాయణ గౌడ ఇంటి ముందు పెట్టేసారు” అని తెలిపారు.