YCP ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు
గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ముస్తఫా సోదరుడైన కర్నూమా ఇంట్లో ఐటీ సోదాలు జరగడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కర్నుమా.. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలు మొత్తం చూసుకుంటున్నారు. గత కొంత కాలంగా కర్నూమా అక్రమంగా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని… ఐటీ అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఐటీ అధికారులు ఇవాళ కర్నూమా ఇంటితోపాటు.. తాడేపల్లి దగ్గర్లో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. మరోవైపు అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చిచెప్పిన ఎమ్మెల్యే ముస్తఫా..
గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 2014, 2019 వరుస సార్వత్రిక ఎన్నికల్లో ముస్తఫా వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయనని ఇప్పటికే ముస్తఫా స్పష్టం చేశారు. ఈ సారి తన కూతురు నూరి ఫాతిమా పోటీ చేస్తుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. గతంలో సీఎం జగన్మోహన్రెడ్డి తూర్పు నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో నూరి ఫాతిమాను ముస్తఫా పరిచయం చేశారు. తండ్రి గెలిచిన నాటి నుంచి ముస్తఫా కుమార్తె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. తండ్రితోపాటుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆమె హాజరవతున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే సోదరుడు కర్నూమా ఇంట్లో ఐటీ సోదాలు జరగడంపై గుంటూరు జిల్లా వైసీపీ పార్టీలో కలకలం రేపుతోంది.
మొన్న నెల్లూరు రూరల్.. నేడు గుంటూరు తూర్పు..
ఇటీవల నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారని.. అది అధికారపార్టీలోని కొందరి కీలక నేతల సూచనల మేరకు జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనను అవమానించారని ఆయన ఆరోపించారు. ఇది ఇలా ఉండగా.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడి ఇంట్లో ఐటీ సోదాలు చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే.. ఆర్థికపరమైన ఆరోపణలు రావడం వల్లే కర్నూమా ఇంట్లో సోదాలు జరుగుతుండగా… వీటిపై అధికార పార్టీకి చెందిన ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. తమ నిజాయతీని చాటుకునేందుకు వైసీపీ ఇలా చేస్తుందా… లేదా.. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.