వచ్చే ఎన్నికల్లోనూ పవన్‌ది అదే నిర్ణయమా?!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రెండు నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నారా? అనే ప్రశ్నకు పార్టీవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల నుండి పోటీచేయాలని పవన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు పై నియోజకవర్గాల్లోని కొందరికి పవన్ నుండి సంకేతాలు అందాయని సమాచారం.
తాజా సమాచారం మేరకు ఆ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఈసారి పోటీ చేస్తే రెండు చోట్ల నుంచి గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు స్ధానికంగానే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రజల్లోనూ మూడోసారి ఎన్నికల్లో పవన్ ఏం చేయబోతున్నారన్న ఆసక్తి పెరుగుతోంది. అదే సమయలో రాష్ట్రంలో కాపు సీఎం డిమాండ్ కూడా అంతకంతకూ ఊపందుకుంటోంది. ఎప్పుడూ కమ్మ, రెడ్లేనా.. ఈసారి కాపులకు రాజ్యాధికారం దక్కాల్సిందేనన్న పట్టుదల ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. దీంతో పవన్ అడుగులకు ప్రాధాన్యం పెరుగుతోంది.
2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. తన పోటీ కోసం రెండు నియోజకవర్గాలు ఎంచుకున్నారు. వీటిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాగా.. మరొకటి విశాఖ జిల్లా గాజువాక. ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఒక్క చోట కూడా పవన్ గెలవలేదు. దీంతో ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే రెండు నియోజకవర్గాల నుంచి పోటీకే పవన్ మరోసారి మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా గోదావరి జిల్లాల నుంచే ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే 2024లో మరోసారి ఆయన ఇదే సీటు నుంచి బరిలో ఉంటారు. దీంతో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కన్నబాబును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ వైసీపీపై విమర్శలు చేసినప్పుడల్లా కౌంటర్లు ఇస్తున్న కన్నబాబు.. నేరుగా పవనే తనకు ప్రత్యర్దిగా ఎదురైతే ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా లేకున్నా కాకినాడ రూరల్ లో పవన్ గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.