Jagananna ku chebudam: టీడీపీ నేత కాల్.. నీ దుంపతెగ అంటూ!

AP: ఏపీ ప్రభుత్వం మంగళవారం జగనన్నకు చెబుదాం(jagananna ku chebudam) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజా ఫిర్యాదులు, వినతుల పరిష్కారమే లక్ష్యంగా సీఎం జగన్‌(jagan) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా సీఎంకు నేరుగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సైతం మంగళవారం నాడు.. జగనన్నకు చెబుదాం హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేశారు. ‘సమస్యను మీరు రికార్డు చేస్తారా? నోట్‌ చేసుకుంటారా? అని కాల్‌లో సంభాషిస్తున్న వ్యక్తిని వర్ల ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు సాంకేతిక లోపం ఉందని తర్వాత చేయాలని అతను సూచించడంతో.. ఆయన కంగుతిన్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ ప్రారంభించన నాడే.. సాంకేతిక లోపం ఏంటని? ప్రశ్నించారు. నీ వల్ల నాకు ఉపయోగం లేదని అసహనం వ్యక్తం చేశారు.

జేకేసీపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘మీరు ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు వందల కొద్ది పెట్టినా… ప్రజా సమస్యల ఫోన్ కాల్స్ తో మీ టెలిఫోన్ జంక్షన్ బాక్సలు జామ్ కావాల్సిందే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కావు అనే స‌త్యాన్ని గ్ర‌హించండి జ‌గ‌న్ గారూ’ అని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు లేని ప్రజలు లేరని.. వైసీపీ ఎమ్మెల్యేలకే అనేక సమస్యలు ఉన్నాయన్నారు. అమరావతి రాజధాని రైతుల సమస్యలు, విశాఖ రైల్వేజోన్, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలను సీఎం జగన్‌ పట్టించుకోలేదని ఆరోపించారు.