అందుకే.. అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలిశారు!
మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. తాను మరోసారి రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదని.. సినిమా రంగంలోనే ఉంటానని ఎన్నోసార్లు స్ఫష్టం చేశారు. అయినప్పటికీ పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు ఆయన్ని కలిసినప్పుడల్లా అనేక ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌కు వివిధ కార్యక్రమాల నిమిత్తం రాగా.. చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి, నాగార్జున, అల్లుఅరవింద్ లను కలిశారు. దీంతో బీజేపీ చిరూకి గేలం వేస్తుందా అన్న అనుమానాలు కలిగాయి. ఈ విపత్తుని ముందే గ్రహించిన చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా.. అనురాగ్ ఠాకూర్ తనను ఎందుకు కలిశారో తెలియజేసి.. సంబంధిత చిత్రాలను పోస్టు చేశారు.
ఈ సందర్భంగా చిరూ.. కేంద్ర మంత్రి అనురాగ్‌ను ప్రస్తావిస్తూ.. ఈ విధంగా ట్వీట్ చేశారు.. ‘మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు.. అదేవిధంగా భారత చలన చిత్ర పరిశ్రమ గురించి మనమధ్య జరిగిన చర్చలు చాలా బాగున్నాయి’ అని ఆ ట్వీట్ లో చెప్పారు. ఇక ఈ చర్చల్లో మరో నటుడు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. నాగార్జున తొలి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈక్రమంలో చిరూని సెంట్రల్ మినిస్టర్ కలవడం.. అదీ బీజేపీకి చెందిన కీలక నాయకుడు చిరంజీవి ఇంటికి వచ్చి కలవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే రాజకీయాలకు సంబంధించి పెద్దగా ఎలాంటి ప్రస్తావనలు రాలేదని సమాచారం. కేవలం వ్యక్తిగత, సినీమాలకు సంబంధించిన భేటీ అని పలువురు చెబుతున్నారు.
మరోసారి బయటపడిన చిరు-నాగార్జున స్నేహ బంధం..
చిరంజీవి, నాగార్జున ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా వారి స్నేహం గురించి తెలియజేశారు. నాగార్జున తనకు ఇష్టమైన వ్యక్తి అని… తనకు సోదరుడని చిరు చెబుతుంటారు. ఇక చిరంజీవి అంటే వ్యక్తిగతంగా, నటుడిగా నాగార్జునకు అమితమైన ఇష్టం. అందుకే వారి కుటుంబ సభ్యులు వివిధ అకేషన్లో తరచూ కలుసుకుంటుంటారు. చిరుతో నాగార్జున తండ్రి దివంగత అక్కినేని నాగేశ్వరరావుతో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించారు. ఆ సమయంలో నాగేశ్వరరావు.. తనపై చూపిన ప్రేమ, ఆప్యాయత, చనువు ఎప్పటికీ మరిచిపోలేనివని ఇటీవల చిరంజీవి ఓ వేదికపై పంచుకున్నారు. అంతకుముందు దివంగత అల్లు రామలింగయ్య.. నాగేశ్వరరావు సోదరభావంతో కుటుంబ సభ్యులుగా ఉండేవారు. అప్పటి నుంచే అల్లు, మెగా, అక్కినేని కుటుంబాలు చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరు ఇంటికి వచ్చిన వేళ.. అక్కడ నాగార్జున కూడా ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ కలిసి మంత్రిని శాలువాతో సన్మానించి, వినాయకుడి ప్రతిమను ఆయనకు అందించారు. ఈ ఫొటోలో అల్లు అరవింద్ కూడా కనిపించడం విశేషం.