Pawan Kalyan: అల్లూరికి భారత రత్న.. జనసేనాని డిమాండ్!
Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు(Alluri Seetarama Raju) పుట్టింది క్షత్రియ కుటుంబంలోనైనా మన్యంలో గిరిజనుల పక్షాన పోరాడిన మహోన్నత యోధుడు. అటువంటి మహన్నోతమైన యోధుడు నేలకొరిగి ఆదివారం నాటికి వందేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అల్లూరికి ఘన నివాళి అర్పించారు. నాటి అల్లూరి పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
అల్లూరి 100వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కడ పాలకులు గతి తప్పుతారో, ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ సీతారామరాజు స్ఫూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని అన్నారు. వీరుడు జన్మించిన పుణ్యభూమిపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నా పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజుకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేటి తరానికి స్ఫూర్తినివ్వడానికి ఇది ఆవశ్యకంగా అభివర్ణించారు. యావత్ భారతావనికి సంకల్పం, పోరాటం, ధీరత్వం, మృత్యువుకు వెరవని ధైర్యం, ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. భారతరత్న ఇవ్వడంతో పాటు అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ గురుతర బాధ్యత తీసుకుంటుందంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.