bengaluru: సమస్యలకు నిలయం.. ఎవరకీ పట్టని వైనం.. ఎందుకిలా?

bengaluru: ఎన్నికలు వస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. బెంగళూరు ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. సిలికాన్‌ వాలీసిటీ, ఐటీ హబ్‌గా దేశంలోనే బెంగళూరు పేరు సంపాదించింది. అయితే.. ఈ మహా నగరంలో జరిగిన అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. బెంగళూరులో ప్రస్తుతం కోటిన్నర మంది జనాభా నివసిస్తున్నారు. ఇది నగరంలో ప్రధాన సమస్యగా మారింది. ఇదే తరుణంలో నీటి సమస్య అక్కడి ప్రజల్ని వేధిస్తోంది. అనేక ప్రాంతాల్లో తాగు నీరుకూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. నగర వాసులను వేధించే మరో సమస్య ట్రాఫిక్‌.. బెంగళూరులో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే.. రద్దీ వేళల్లో దాదాపు గంటన్నరకు పైగా సమయం పడుతుంది. నగరంలో కోటికి పైగా వాహనాలు ఉండటంతోపాటు ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కూడా చిత్తశుద్దితో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలను డంప్‌ చేసే ఏర్పాటు లేకపోవడంతో అవి ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లో అక్రమంగా అనేకమంది ఇళ్లు, అపార్ట్‌మెంట్లను నిర్మించారు. చిన్నపాటి వర్షం కురిసినా.. బెంగళూరులోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. నగరంలో పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడంతో వాతావరణం వేడెక్కుతోంది.

ఇక మరో వారం రోజుల్లో కర్నాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బెంగళూరుపై ప్రధాన పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. దీనికి కారణం.. బెంగళూరులో 28 స్థానాలు ఉన్నాయి. నగరంలో ఎక్కువ మంది స్థానికేతరులు ఉన్నారు. వీరందరూ కుల, మతాలకు అతీతంగా ఓటు వేస్తుంటారు. రాజధానిలో పట్టు సాధిస్తే.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఏ పార్టీకి అయినా.. నల్లేరుమీద నడకే. ఇది కర్నాటకలో గతంలో కూడా నిరూపితమైంది. దీంతో ప్రధాని మోదీతో సహా, ఇతర పార్టీల అగ్రనేతలు బెంగళూరుపై దృష్టి సారించారు. నగరంలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.