cm jagan: హామీ ఇచ్చినా.. పట్టు వీడని బాలినేని!
vijayawada: సీఎం జగన్(cm jagan)తో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ex minister balineni srinivas reddy) భేటీ అయ్యారు. గత కొన్నాళ్లుగా బాలినేని పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో బాలినేనికి ఇచ్చిన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. దీనిపై పార్టీ పెద్దలు బాలినేనిని సంప్రదించే ప్రయత్నం చేసినా… ఫలితం లేకపోయింది. ఇప్పుడు తాజాగా సీఎం జగన్ జోక్యం చేసుకోవడంతో మంగళవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. జగన్, బాలినేని మధ్య సుమారు అరగంటకు పైగా సంభాషణ జరిగింది. ఈ సందర్బంగా ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలను తిరిగి తీసుకోవాలని సీఎం జగన్.. బాలినేనిని కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆ బాధ్యతలను తాను నిర్వర్తించలేనని చెప్పుకొచ్చారు. ఇక ప్రొటోకాల్ అంశం(protocal issue) కూడా బాలినేని.. సీఎం వద్ద ప్రస్తావించారు. తనకు జిల్లాలో సముచిత స్థానం కల్పించలేదని, కోరిన అధికారులను కూడా బదిలీ చేసుకోలేకపోతున్నానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి సారిస్తానని సీఎంతో బాలినేని చెప్పగా.. ఒంగోలు మాత్రమే కాకుండా.. ఇతర నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెంచాలని ఆయన సూచించారు. ఇక త్వరలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు కొత్త ప్రాంతీయకర్తను నియమించే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ భేటీ అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఇంకా ఆయన పార్టీపై గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో మంత్రి సురేష్‌కు, బాలినేని మధ్య కొంత గ్యాప్ నడుస్తోంది. జిల్లాలో అధికారుల బదిలీలు, రాజకీయాలపై మంత్రి సురేష్ ఆధిపత్యం కనిపిస్తోందని టాక్. ఇక ఇటీవల సీఎం సభకు వచ్చిన బాలినేని వాహనాన్ని పోలీసులు నిలువరించిన ఘటన పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. దీంతో బాలినేని అసంతృప్తితో ఉన్నారని ఆయన వర్గం చెబుతోంది.