Sita Ramam: దాదాసాహెబ్ ఫాల్కే కొట్టేసిన క్లాసిక్!

Hyderabad: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తెలుగు సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించింది. యుద్ధం రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. ఓ క్లాసిక్​ లవ్​స్టోరీగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. స్వప్న సినిమాస్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్త్ 30 కోట్లతో ఈ సినిమాని నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 98 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ లో విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ లవర్స్ ని మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ ని కూడా సినిమాలోని పాటలు అలరించాయి. ఇక క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ తాజాగా ప్రముఖ అవార్డుని అందుకుంది. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) జ్యూరీ క్యాటగిరిలో బెస్ట్ మూవీగా అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్​ ఠాకూర్​ టాలీవుడ్​ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీతారామం విజయంతో టాలీవుడ్​లో వరుస అవకాశాలను కూడా అందుకుంటోంది ఈ భామ.