Mokshagna: బాలకృష్ణ వారసుడి ఎంట్రీ ఫిక్స్!

Hyderabad: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వారసుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja) ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. తన కొడుకు సినిమాల్లోకి కచ్చితంగా వస్తాడని బాలయ్య చెప్పడంతో ఆరోజు ఎప్పుడా అనే ఆసక్తి నెలకొంది. దీంతో మోక్షజ్ఞ ఏ సినిమాతో వస్తాడా.. అతడిని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరా.. ఎలాంటి సినిమాతో ఈ నందమూరి వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడా అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. కానీ, ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను(Boyapati Srinivas) తెరకెక్కించే NBK109 సినిమాలో మోక్షజ్ఞ వెండితెరపై మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తోన్న బోయపాటి, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి బాలయ్యతో చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ కీలక పాత్ర కోసం మోక్షజ్ఞను తీసుకునేందుకు బోయపాటి ఆసక్తిని చూపుతున్నారట. కేమియో తరహా పాత్రలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత హీరోగా చేసేందుకు మోక్షజ్ఞ రెడీ అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ముందుగా అతిథి పాత్రల్లో నటించి, ఆ తరువాత హీరోగా మారాలని మోక్షజ్ఞ ప్లాన్ చేస్తున్నాడా.. లేక నేరుగా హీరోగానే తెరంగేట్రం చేస్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!