నేను లైంగిక దాడి చేస్తే మ‌రి పెళ్లిళ్ల‌కు ఎందుకు పిలిచారు?

Delhi: త‌మ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని wfi చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్‌(brij bhushan sharan singh)కు వ్య‌తిరేకంగా రెజ్ల‌ర్లు(wrestlers) ఆందోళ‌న చేస్తున్నారు. వారం రోజులుగా దిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద రెజ్లర్లు ధ‌ర్నా చేస్తున్నారు. రోడ్ల‌పైనే నిద్రిస్తూ, అక్క‌డే తింటూ, వ్యాయామాలు చేస్తున్నారు. దాంతో వారి ఆందోళ‌న సుప్రీంకోర్టుకు చేరింది. పోలీసులు బ్రిజ్ భూష‌ణ్‌పై వెంట‌నే FIR న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో బ్రిజ్ భూష‌ణ్ మీడియాతో మాట్లాడారు. “wfiకి నేను చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టి నుంచి గ‌త 12 ఏళ్ల‌లో నాపై ఇలాంటి ఫిర్యాదులు ఒక్క‌సారి కూడా రాలేదు. నేను లైంగికంగా వేధించాను అంటున్నారు. అలాంటప్పుడు 12 ఏళ్ల క్రితం ఎందుకు నాపై ఫిర్యాదు చేయ‌లేదు? ఎవ‌రైతే ఆందోళ‌న చేప‌డుతున్నారో వారే న‌న్ను త‌మ పెళ్లిళ్ల‌కు పిలిచారు, నాతో క‌లిసి ఫొటోలు దిగారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్‌వాల్వ్ అయ్యి ఉంది కాబ‌ట్టి నేను ఏ విచార‌ణ‌నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. నేను నిర్దోషిని. నేను ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. వారు నాపై వేస్తున్న నిందలు వింటుంటే చ‌చ్చిపోవాల‌ని అనిపిస్తోంది. ఇది రెజ్ల‌ర్లు చేస్తున్న ఆందోళ‌న‌లా క‌నిపించ‌డం లేదు. దీని వెనుక కాంగ్రెస్, ఇతర పారిశ్రామికవేత్త‌లు ఉన్న‌ట్లు అనుమానంగా ఉంది.” అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు బ్రిజ్ భూష‌ణ్‌.

రెజ్ల‌ర్ల‌కు ఇత‌ర క్రీడాకారులు, రాజ‌కీయ‌నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈరోజు ఉద‌యం కాంగ్రెస్ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ రెజ్ల‌ర్ల‌తో పాటు ఆందోళ‌న‌లో కూర్చున్నారు. వారిని ఓదార్చారు. కేంద్రం బ్రిజ్ భూష‌ణ్‌ను ఎందుకు కాపాడాల‌ని చూస్తోంద‌ని మండిప‌డ్డారు. పోలీసులు భూష‌ణ్‌పై ఫిర్యాదు చేసిన‌ప్పుడు ఆ FIR చూపించాల‌ని డిమాండ్ చేసారు.