Drugs: ఏపీలో ప్రమాదకర డ్రగ్స్ తయారీ.. అధికారులకు షాక్
vijayawada: ఆంధ్రప్రదేశ్(Ap) నుంచి విదేశాలకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఇది మందుల రూపంలో విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలకు పంపిస్తుండటం అధికారులు షాక్ తిన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించే ఐసిస్, బోకోహరామ్ ఉగ్రవాద సంస్థలకు ‘ఐసిస్ డ్రగ్'(isis drug)గా పిలిచే ట్రెమడాల్(smuggling tramadol tablets) అనే సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ను మాత్రల రూపంలో పంపిస్తుండగా.. నరసరావుపేటకు చెందిన తెలుగు వ్యక్తిని ముంబయిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ టాబ్లెట్లు నరసరావుపేటకు చెందిన సేఫ్ ఫార్మా అనే కంపెనీ నుంచి తయారైనట్లు గుర్తించారు. దాదాపు పది లక్షల మాత్రలను అధికారులు సీజ్ చేశారు.
బెంగళూరు నుంచి ఫస్ట్‌వెల్త్ సొల్యూషన్ అనే సంస్థ ముంబయి నుంచి దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు కాల్షియం కార్పొనేట్ మాత్రల పేరుతో ట్రెమడాల్‌ను ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బెంగళూరు కంపెనీకి నరసరావుపేటలోని సేఫ్ ఫార్మా నుంచి ఆ మందులు సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో సేఫ్ఫార్మా డైరెక్టర్ శనగల శ్రీధర్‌రెడ్డి అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ట్రెమడాల్ మాత్రల తయారీని భారత్‌లో 2018లో నిషేధించారు. ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి ఓ రకమైన మాదక ద్రవ్యం అని గుర్తించారు. అయితే.. వీటిని తయారు చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో కొన్ని నిబంధనలను కేంద్రం పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన పరిమాణంలో, కొన్ని కాంబినేషన్స్‌లో మాత్రమే ట్రెమడాల్ మాత్రలు తయారు చేయవచ్చని చెప్పింది. ఒకవేళ ఇతర దేశాలకు వాటిని పంపాలంటే.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనుమతి పొందాల్సి ఉంది. కానీ సేఫ్ ఫార్మా మాత్రం ఎలాంటి అనుమతులు పొందలేదు. పైగా క్యాల్షియం మాత్రల ముసుగులో వాటిని తరలిస్తూ.. ఇతర దేశాలకు పంపడం వెనుక భారీ కుట్ర ఉందని కస్టమ్స్ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. ట్రెమడాల్ మాత్రలను అలసట రాకుండా ఉండేందుకు ఎక్కువ సమయం ఉత్తేజంగా ఉండేందుకు ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తారు.