operation kaveri: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వేగవంతం
delhi: సూడాన్(sudan) దేశంలో అంతర్యుద్దం భీకరంగా కొనసాగుతోంది. ఆ దేశంలోని పారా మిలటరీ దళాలు, ఆర్మీ మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ దేశంలో ఉన్న భారతీయులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. ఆపరేషన్ కావేరీ పేరుతో.. ప్రత్యేక విమానాల ద్వారా సూడాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా ఇక్కడికి తీసుకొస్తున్నారు మన జవానులు. అలా ఇప్పటివరకు 670 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మరింత వేగంగా కొనసాగుతోంది. తాజాగా 246 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా జవానులు చేస్తున్న సేవలను వారు కొనియాడుతున్నారు.
సూడాన్‌లో ఇంకా 2400 మంది వరకు భారతీయులు చిక్కుకున్నట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్తోం వరకు వాళ్లంతా చేరుకుంటే స్వదేశానికి చేర్చడం సాధ్యమవుతందని తెలిపింది. చాలామంది భారతీయులు అంతర్యుద్దం జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. స్వదేశం రావడానికి 3400 భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఢిల్లీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు .. INS సుమేధ, INS తేగ్, INS తర్కష్‌ను ఉపయోగిస్తున్నారు. యుద్ధ సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సహా తరలింపు ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ భారతీయుల కోసం ఖార్తుం నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. ఖార్తుం నుంచి పోర్ట్ సూడాన్ కు, అక్కడి నుంచి జెడ్డాకు, అక్కడి నుంచి భారత్ కు.. ఇలా తరలింపు ప్రక్రియ సాగుతోంది.