brs formation day: వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి సీటు ఇవ్వను
Hyderabad: భాగ్యనగరంలోని తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని సుమారు 270 మంది నాయకులు పాల్గొన్నారు. ముందుగానే అనుకున్నట్లు ఎన్నికలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్.. పరోక్షంగా పలువురిని మందలించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలైన దళితబంధు, డబుల్బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాల్లో కొందరు ఎమ్మెల్యేలు, వారి కింది నాయకులు డబ్బులు తీసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు వస్తే.. వచ్చే ఎన్నికల్లో వారికి సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆదేశించారు. నీరు కావాలన్నప్పుడు బావిని తవ్వుతాను అనే ధోరణిని ఎమ్మెల్యేలు విడనాడి.. ప్రజల మధ్య ఉండాలన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకెళ్తోందని కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తామని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని.. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునుపటికన్నా ఎక్కువ సీట్లు రావాలన్నదే లక్ష్యం అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో తిరగని వారికి ఈ సారి ఎమ్మెల్యే సీటు ఇవ్వనని స్పష్టం చేశారు.