Bhumika Chawla: మోసం చేశారు!

Hyderabad: సినీ పరిశ్రమకి వచ్చిన అమ్మాయిలకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తానూ అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నానంటూ చెబుతున్నారు ఒకప్పటి టాప్​ హీరోయిన్​ భూమికా చావ్లా(Bhumika Chawla). తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాల గురించి పలు విషయాలు పంచుకున్నారు.

‘నేను హిందీలో చేసిన తొలి సినిమా తేరే నామ్(Tere Naam) మంచి విజయం సాధించడంతో.. నాకు మంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. తేరే నామ్ తర్వాత నాకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ.. నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. టైటిల్ కూడా ఛేంజ్ చేశారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే, ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నాను. కానీ.. ఇంకేది జరిగింది. ఆ సినిమా కోసం నేను మరే మూవీ ఒప్పుకోకుండా, ఏడాది పాటు ఎదురుచూశాను. చివరికి నాకు నిరాశే మిగిలింది. కేవలం ఇదొక్కటే కాదు.. జబ్ వీ మెట్ సినిమాకి మొదటగా నేనే సంతకం చేశాను. తొలుత నాకు జోడీగా బాబీ డియోల్‌ అన్నారు. ఆ తర్వాత షాహిద్ కపూర్‌ని తీసుకున్నారు. కట్ చేస్తే.. ఆ సినిమాలో షాహిద్ కపూర్(Shahid Kapoor), కరీనా కపూర్(Kareena Kapoor) కలిసి నటించారు. నన్ను తీసేశారు’ అంటూ భూమిక చెప్పుకొచ్చారు.

యువకుడు సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టిన భూమిక ఖుషి(Kushi), సింహాద్రి, ఒక్కడు(Okkadu) వంటి బ్లాక్​బస్టర్​ హిట్లతో టాప్​ హీరోయిన్​గా ఎదిగారు. కొన్నాళ్ల గ్యాప్​ తర్వాత సెకండ్​ ఇన్నింగ్స్​ మొదలుపెట్టి ప్రస్తుతం మంచి క్యారెక్టర్లతో అలరిస్తున్నారు.