జిమ్ చేస్తూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిన ఘటన మరవకముందే అలాంటిదే మరో ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జిమ్ చేస్తుండగా కళ్లు తిరుగుతున్నాయని తన స్నేహితుడికి చెప్పాడు. దాంతో ఆ యువకుడి స్నేహితుడు మంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో ఆ యువకుడు మూర్ఛతో పడిపోయాడు. అక్కడున్నవారు సాయం చేసాక కోలుకున్నాడు కానీ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ పడిపోయాడు. దాంతో వెంటనే బాధితుడ్ని స్థానిక హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే అతనికి గుండెపోటు రావడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యువకుడు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి వద్ద ఉంటున్నాడు. లిపారు. అతను గుండె పోటుకు గురయ్యారని, అందుకే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇటీవల అతనికి పెళ్లి కుదరిందని, ఈలోగా ఇలా జరిగిపోయిందంటూ బంధువులు విలపించారు. అయితే మృతుడి వివరాలు చెప్పడానికి మాత్రం కుటుంబీకులు అంగీకరించలేదు.
మొన్న బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్ విశాల్ (24) కూడా ఇలాగే గుండెపోటుతో జిమ్‌లోనే కుప్పకూలాడు. ఆసిఫ్ నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విశాల్ రోజూలానే శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లాడు. వామప్ చేసిన తర్వాత వేగంగా పుషప్స్ చేసాడు. తర్వాత కొద్దిసేపటికే విపరీతంగా దగ్గుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో జిమ్‌లో ఉన్న కొందరు వ్యక్తులు విశాల్‌ను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే విశాల్ తండ్రి మాత్రం దీనిని అనుమానాస్పద మృతిగా భావించి కేసును దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.