Amit shah: అమ్మవారి గుడి ముందు చెప్పులతో అమిత్ షా
Karnataka: కర్ణాటక ఎన్నికలు(karnataka elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారానికి పోటెత్తాయి. ఎవ్వరూ ఏమాత్రం తగ్గకుండా ప్రజలు తమకు ఓటు వేసేలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అయితే కేంద్రమంత్రి అమిత్ షా(amit shah) చేసిన పనికి ఇప్పుడు వివాదంలో పడ్డారు. కర్ణాటకలో ప్రచారం కోసం వచ్చిన అమిత్ షా.. అమ్మవారి దర్శనం కోసమని స్థానిక చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అయితే దర్శనం తర్వాత బయటికి వచ్చిన అమిత్ షా చెప్పులతో నిలబడి ఫొటో దిగారు. ఆయనతో ఉన్నవారెవ్వరూ చెప్పులు వేసుకోలేదు. దాంతో బీఆర్ెస్ ఎమ్మెల్యే సీతక్క.. అమిత్ షా ఫొటోను ట్వీట్ చేస్తూ మండిపడ్డారు.
“ఇది మీ భక్తి. దైవం ముందు మీకున్న యాటిట్యూట్ ఇది. దైవం కంటే మీరే గొప్ప అన్న మీ ఆలోచనా విధానికి త్వరలో దైవమే బుద్ధిచెప్తుంది” అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌పై ప్రముఖ నటి కస్తూరి శంకర్ కూడా స్పందించారు. “ఈ ఫొటో హిందువుల సెంటిమెంట్‌కే షాకింగ్. చాముండి ఆలయాన్ని ఎందుకు అమిత్ షా అపవిత్రం చేస్తున్నారు? ఆయన పక్కన ఉన్న వారు ఎవరూ చెప్పులు వేసుకోలేదు. తనకి తాను హిందువును కాదు అనుకుని ఇలా అమ్మవారిని అవమానిస్తున్నారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆలయం బయటకి వచ్చేసాక చాలా మంది చెప్పులు వేసుకుంటారని, ప్రతీదానినీ భూతద్దంలో చూడాల్సిన పనిలేదని కామెంట్లు పెడుతున్నారు.