Amritpal: మొత్తానికి పట్టుబడ్డ అమృత్‌పాల్ సింగ్
Punjab: వారిస్ పంజాబ్ దే(waris punjab de) నేత, పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్(amritpal singh) మొత్తానికి పట్టుబడ్డాడు. దాదాపు నెల రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో పోలీసులకు సరెండర్ అయిపోయాడు. సరెండర్ అవడానికి ముందు మోగాలోని గురుద్వారాలో ప్రసంగం ఇచ్చాడు. కొన్ని నెలల క్రితం పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో భాగంగా.. పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తుఫాన్ సింగ్‌ను అరెస్ట్ చేసారు. ఇతను అమృత్ పాల్ సింగ్‌కు సన్నిహితుడు. తన స్నేహితుడిని ఎలాగైనా విడిపించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 24న అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని ప్లాన్ వేసాడు.
ఈ నేపథ్యంలో కొందరు పంజాబీలను నియమించుకుని వారిని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేసాడు. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అడ్డంపెట్టుకుని నిరసనకారులు పెద్ద గొడవ చేయడంతో మరోదారి లేక పోలీసులు లవ్ప్రీత్ను విడుదల చేసారు. అల్లర్లు చేయాలని ప్రజలను రెచ్చగొట్టిన నేపథ్యంలో పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయాలని అనుకున్నారు. అతను శనివారం జలంధర్ ప్రాంతానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అమృత్‌పాల్ చిక్కినట్లే చిక్కి అనుచరుల సాయంతో బైక్‌పై పరారయ్యాడు. దాంతో పంజాబ్‌లో హైఅలర్ట్ నెలకొంది. అప్పటినుంచి పలు వేషధారల్లో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అమృత్‌పాల్ ఈరోజు సరెండర్ అయిపోయాడు.