politics: రేవంత్‌, ఈటలకు విజయశాంతి క్లాస్‌!

hyderabad: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి(tpcc chief revanth reddy)పై హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(mla etela rajendhar) ఇటీవల పలు ఆరోపణలు చేసిన సంగతి విదితమే. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ సీఎం కేసీఆర్(cm kcr) రూ.25 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే ఈటల ఆరోపించారు. ఇక దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి… తమకు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు వేసుకున్నారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ఈటలకు సవాలు విసిరారు. తాను డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్న రాజేందర్‌ను శనివారం హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని రేవంత్ సవాలు చేశారు. అయితే దీనిపై రాజేందర్‌ నుంచి స్పందన రాలేదు. ఈ విషయంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి(vijaya shanthi) తాజాగా స్పందించారు. రాష్ట్ర పాలనపై పోరాడేవారు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సరికాదని అన్నారు.

తెలంగాణ ఎన్నికలు.. దేశంలోనే అత్యంత ధన ప్రభావితమైనవని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థపై పోరాడాల్సిన కర్తవ్యం ప్రతిపక్ష నాయకులపై ఉందని అన్నారు. అధికార పార్టీపై పోరాటం చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నేతలు పరస్పరం సవాళ్లు చేసుకోవడం సరికాదని విజయశాంతి పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు దాడులు చేసకోకుండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ నిరంతరం తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం తన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.