Pooja Hegde: ఆ సినిమాపైనే ఆధారపడిన పూజ కెరీర్​!

Hyderabad: ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే(Pooja Hegde) ఒకరు. కెరీర్​ ఆరంభం నుంచే వరుసగా తెలుగు, తమిళ్, హిందీ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కొంతకాలంగా పూజ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్(Prabhas) సరసన నటించిన రాధేశ్యామ్(Radhe Shyam), ఆచార్య(Acharya), బీస్ట్, సర్కస్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుసగా ఫ్లాప్‌లు వస్తున్న సమయంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్( Salman Khan) సరసన నటించే అవకాశం రావడంతో పూజకు మరో ఛాన్స్​ దొరికినట్టైంది.

హిందీతోపాటు తెలుగులోనూ విడుదలైన కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​(Kisi Ka Bhai Kisi ka Jaan) సినిమాతో హిట్‌ ట్రాక్ ఎక్కాలని భావించింది పూజ. అయితే ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హంగామా చేయలేకపోవడంతో పూజా నిరాశకు గురయ్యారని సమాచారం. ఈ సందర్భంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘నేను నటించిన 4, 5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ నేను ఫెయిల్ అవ్వలేదు. నా నటనకు, డాన్సులకు ప్రశంసలు దక్కాయి’అని చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు–త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో పూజా తో పాటు శ్రీ లీల కూడా నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా పూజను హిట్​ ట్రాక్​ ఎక్కిస్తుందో చూడాలి!