tspsc: పేపర్ లీక్ అంశంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!
hyderabad: తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అవడం సంచలనం అయిన విషయం తెలిసింది. దీనిపై ప్రస్తుతం ఈడీ, సిట్ బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తెలంగాణ కమిషన్‌లో పది కొత్త పోస్టులను తాజాగా మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కొత్త పోస్టులను మంజూరు చేసింది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బి.ఎం.సంతోష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలను నుంచి ఆయనను బదిలీ చేసింది. సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఇప్పటికే టీఎస్పీఎస్ పరిధిలో రద్దయిన పరీక్షలు, పోస్టుపోన్ చేసిన పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ కూడా రానున్న పరీక్షలను గట్టి భద్రత నడుమ నిర్వహించనున్నట్లు చెబుతోంది.