Covid: భారత్లో 40 మంది మృతి
Delhi: భారత్(india)లో కరోనా వైరస్(Carona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే.. మరోవైపు దేశంలో కరోనా మరణాల(covid deaths) సంఖ్య పెరుగుతోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటిపోయింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 12,591 మంది కరోనా బారినపడ్డారు. ఇక దేశంలో ఒక్క రోజే 40 మంది మృతిచెందారు. వీరిలో 11 మంది కేరళ నుంచే ఉండటం గమనార్హం. నిన్నటితో పోలిస్తే 20 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 65,286 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల మంది వైరస్ బారిన పడగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,230కు చేరింది. 4,42,61, 476 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5.32 శాతంగా ఉందని… రికవరీ రేటు 98.67 శాతం, యాక్టివ్ కేసుల శాతం 0.15 గా ఉందని పేర్కొన్నారు.
బూస్టర్ డోసులు వేయించుకోవాలి..
కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి ఇటీవల సూచించారు. దీంతో ఇప్పటికే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ ఉచితంగా జరుగుతోంది. ఇక ప్రజలందరూ మరోసారి బూస్టర్ డోసులు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.