Vijay: మరో తెలుగు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన దళపతి!

Chennai: టాలీవుడ్​ హీరోలకి ఇతర రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నట్లే, ఇతర భాషల హీరోలకూ తెలుగు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్(Kollywood)​ స్టార్​ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్​ ఎక్కువ. తమిళ​ స్టార్ హీరో విజయ్(Vijay) ఇటీవలే ‘వారిసు(Varisu)’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను టాలీవుడ్​ దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) తెరకెక్కించగా తెలుగులోనూ వారసుడు(Varasudu) టైటిల్​తో విడుదలైంది. కంప్లీట్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగువారిని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ విజయ్​ నటించిన విజిల్​, సర్కార్​ వంటి సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇక ప్రస్తుతం విజయ్​ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నారు.
అయితే, ఈ సినిమా తరువాత విజయ్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓ తెలుగు డైరెక్టర్‌తో చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విజయ్ కోసం తెలుగు డైరెక్టర్ గోపీచంద్​ మలినేని అదిరిపోయే కథను రెడీ చేశాడని.. ఇప్పటికే విజయ్‌కు నెరేట్ కూడా చేశారని తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్న గోపీచంద్ మలినేని, ఇటీవల వీరసింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు విజయ్‌తో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయాలని గోపీచంద్ మలినేని చూస్తున్నారట. ఈ కాంబినేషన్లో సినిమా ఓకే అయితే దక్షిణాది సినీ ప్రేక్షకులకు పండగే అంటున్నారు నెటిజన్లు.