World heritage day: వేడుకలకు రామప్ప ముస్తాబు.. తమన్‌, శివమణితో ప్రదర్శన

Hyderabad: కాకతీయుల కళావైభవాన్ని చాటిచెప్పే కట్టడాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే.. ప్రత్యేకమైన ఆలయం రామప్ప టెంపుల్‌. ఈ ఆలయం ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలో ఉంది. కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. దాదాపు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా. రామప్ప ఆలయం.. శిల్ప కళా వైభవాలకు నిలువెత్తు రూపం. ప్రపంచ పర్యాటకులను సైతం రామప్ప కట్టడం ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 2021 జులైలో యునెస్కో(UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశం (World heritage site)గా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు ఉండగా యూనెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. అందులో భారత్‌ (India) నుంచి రామప్పకు మాత్రమే చోటు లభించింది. కాకతీయ రాజు ఐనా గణపతిదేవ పాలనలో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టు చరిత్రలో చెబుతోంది. ఈ ఆలయాన్ని రామప్ప అనే శిల్పి నిర్మించడం వల్ల ఈ ఆలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఇలా ఒక శిల్పి పేరుమీద దేవాలయం పేరు పెట్టడం అనేది దేశంలో మరెక్కడా లేదు.

యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్‌, డ్రమ్మర్ శివమణి, గాయకుడు కార్తీక్, ఫ్లూటిస్ట్ నవీన్‌తోపాటు, బలగం చిత్రబృందం సైతం ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి కోసం ములుగు పట్టణం నుంచి రామప్ప ఆలయం వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ థీమ్‌తో వేడుకలు జరగనున్నాయి. అశోక్ గురజాలే నేతృత్వంలో ఆరాభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వారిచే వయోలిన్ సింఫనీ, ప్రదర్శన పేరిణి రాజ్‌కుమార్, ఆయన బృందంతో పేరిణి నృత్య ప్రదర్శన చేయనున్నారు.