పొట్టలోనే కర్చీఫ్.. జగిత్యాల వైద్యుల నిర్వాకం
Jagtial: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటోంది. ఇటీవల విజయవాడ(vijayawada) ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఓ మహిళ చేతికి వైద్యులు కట్టుకట్టారు. ఈక్రమంలో సర్జికల్ బ్లేడ్‌ను చేతిలోనే ఉంచి కట్టుకట్టారు. దీంతో ఆమె మణికట్టుకు మొత్తం ఇన్ఫెక్షన్ సోకింది. తీరా ఆసుపత్రికి వెళ్లేసరికి చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని.. మణికట్టు తీసేయాలని చెప్పడంతో ఆ మహిళ కంగుతుంది. ఇక తాజాగా తెలంగాణ(telangana) జగిత్యాల(jagtial) జిల్లాలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్వాకం వల్ల ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత తన తల్లిగారి ఇల్లు జగిత్యాల కావడంతో ఏరియా ఆస్పత్రిలో గతేడాది డిసెంబర్ లో ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడ ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలోనే కర్చీఫ్, కాటన్ గుడ్డను వదిలేశారు. దీంతో అప్పటి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. రోజు రోజుకీ నొప్పు ఎక్కువ కావడం.. ఎన్ని మందలు వాడినా ఫలితం లేకపోవడంతో.. వేములవాడ పెద్ద ఆసుపత్రిలో చేరింది. అక్కడ స్కానింగ్ చేసి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవ్య పొట్టలో కాటన్ గుడ్డలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి.. పొట్టలో ఉన్న క్లాత్ గుడ్డలను తొలగించారు. ఇప్పటికే ఆమెకు ఒక ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం మరోసారి ఆపరేషన్ చేశారు. ఈ ఘటనలో నివ్వెరపోయిన బాధితురాలి బంధువులు.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే.. జగిత్యాలలో ఉన్న మాత శిశు, ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆరుగురు గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మృతి చెందినట్లుగా సమాచారం. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.