karnataka elections: శరద్ పవార్ ప్లాన్ అదే.. అందుకే పోటీ!
bengaluru: శరద్ పవార్(sharad pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp) ఇటీవల జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించిన మేరకు.. ఆ పార్టీ జాతీయ హోదా కోల్పోయింది. దీంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka elections) పోటీ చేయాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సుమారు.. 40 – 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో తమ అభ్యర్థులను బరిలో దించాలనుకుంటోంది. అయితే దీనిపై పవార్ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఎన్సీపీ ఎన్నికల బరిలో నిలిస్తే.. కొంత కాంగ్రెస్ ఓట్లకు గండిపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకుంటుంది అన్న తరుణంలో.. ఎన్సీపీ శరద్‌పవార్ నిర్ణయంతో కాంగ్రెస్ నేతలు డీలా పడుతున్నారు. ఇప్పటికే.. ప్రతిపక్షాల ఐక్యతకోసం బీహార్ సీఎం అడుగులు వేస్తున్న తరుణంలో.. ఎన్సీపీ కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా మారి కర్నాటక ఎన్నికల్లో పోటీకి నిల్చోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీ(ఎస్) నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్నాటకు క్యూ కడుతున్నారు.