బరువు తగ్గాలా? ఇవి తాగేయండి
ఊబకాయం అనేది ఈరోజుల్లో చిన్న పెద్దా తేడా లేకుండా అందరినీ బాధపెడుతున్న సమస్య. సర్వ రోగాలకు మూల కారణాల్లో ఈ ఊబకాయం ఒకటి. దీని బారి నుంచి తప్పించుకోవాడానికి కొందరు జిమ్‌ల బాట పడుతుంటే మరికొందరు యోగా, పిలాటిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే తగినంత ఎక్సర్సైజ్ చేస్తూనే బరువును నియంత్రించుకోవడానికి కొన్ని డ్రింక్స్ తాగితే మరింత ఫలితం ఉంటుంది అంటున్నారు ఆహార నిపుణులు. నిత్యం కిచెన్‌లో దొరికే కొన్ని వస్తువులతోనే ఈ డ్రింక్స్ తయారుచేసుకుని ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో చూద్దామా..
లెమనేడ్
నిమ్మకాయలతో తయారుచేసుకునే లెమనేడ్ అంటే అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉదయం లేవగానే గ్లాసుడు నిమ్మసంలో తేనె వేసుకుని తాగేస్తుంటారు. దీనినే కాస్త స్టైలిష్‌గా లెమనేడ్ అని పిలుస్తారు. ఉదయం లేచి ఈ నిమ్మరసం తాగగానే శరీరం ఉత్తేజితం అవుతుంది. ఆ తర్వాత జిమ్, జాగింగ్ చేసుకోవచ్చు. అయితే నిమ్మకాయ రసంలో కొందరు చెక్కర, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకుని తాగుతుంటారు. దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. నిజానికి గోరెవెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగేస్తే మంచిది. ఉదయాన్నే నోటికి చేదు పదార్థం ఎందుకు అనుకుంటే కాస్త తేనె వేసుకుని తాగితే మంచిది. దీని వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు త్వరగా కరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
హల్దీ పాలు
పాలల్లో హల్దీ (పసుపు) వేసుకుని తాగితే ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పసుపులో ఉండే కర్క్యుమిన్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్ల బారిన పడకుండా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. రాత్రి పడుకునే ముందు చాలా మంది పాలు తాగే అలవాటు ఉంటుంది. మామూలు పాలు తాగే బదులు అందులో కాస్త పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు కొవ్వును కూడా కరిగించేందుకు తోడ్పడుతుంది. అయితే పసుపు కలిపిన పాలు రాత్రి తాగే బదులు ఉదయం నిద్రలేవగానే తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. క్రమం తప్పకుండా తాగితే శరీరంలో జరిగే మార్పులు మీకే తెలుస్తాయంటున్నారు.
సిట్రస్ వాటర్
సిట్రస్ అంటే నిమ్మజాతి పండ్లు. నిమ్మకాయ రసం కంటే సిట్రస్ వాటర్ తీసుకుంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వాటర్‌ను ఎలా తయారుచేసుకోవాలం నిమ్మకాయలతో పాటు నారింజ పండ్లను ఒక బాటిల్లో వేసి అందులో నీళ్లు పోసి ఉంచాలి. కాసిన్ని పుదీనా ఆకులు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే తాగితే అందులో ఉన్న సుగుణాలన్నీ శరీరానికి అంది ఉత్తేజితపరుస్తాయి. ఈ వాటర్ శరీరాన్ని నేచురల్‌గా డీటాక్స్ చేస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది తాగితే బరువు సులువుగా తగ్గుతారని ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఎన్నో బ్రాండ్లు కూడా వివిధ రకాల ఇంగ్రీడియంట్స్‌తో గ్రీన్ టీ బ్యాగ్స్‌ను తయారుచేస్తున్నాయి. బరువును నియంత్రించడంలోనే కాకుండా మెటబాలిజంను పెంచే సుగుణాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.
అజ్వైన్ వాటర్
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా అజ్వైన్ వాటర్‌ను తీసుకుంటుంటారు. పరగడుపున అజ్వైన్ నీళ్లు తాగితే తొందరగా పొట్ట తగ్గుతుందని నమ్ముతారు. ఒక గ్లాసు వేడినీళ్లలో ఒక టీస్పూన్ అజ్వైన్ వేసుకుని తాగితే నెలలోనే 4-5 కిలోల బరువు తగ్గుతారట. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు బరువు, కొవ్వు పరమైన సమస్యలు ఉంటే ఈ డ్రింక్స్ తాగుతూ వ్యాయామం చేస్తూ ఉండండి.