JDS manifesto: మహిళలు, రైతులకు బంపర్ ఆఫర్
Bengaluru: కర్నాటక ఎన్నిక(karnataka elections)ల్లో గెలుపే లక్ష్యంగా జేడీఎస్(jds) పార్టీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా నిన్న ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (hd deve gowda) మ్యానిఫెస్టోని(manifesto) విడుదల చేశారు. ఇందులో మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే 142 మంది ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులను జేడీఎస్ ప్రకటించింది. ఇంకా 82 మందిని ప్రకటించాల్సి ఉంది. ఈక్రమంలో మ్యానిఫెస్టోని విడుదల చేసింది. రైతులకు ఎకరాకు రూ.10,000 సబ్సిడీ అందిస్తామనే ప్రతిపాదన కూడా జేడీఎస్ చేసింది. వ్యవసాయ కూలీలకు నెలవారీ రూ.2,000 అలవెన్సు ఇస్తామని, వ్యవసాయం వృత్తిగా తీసుకునే యువకులను పెళ్లి చేసుకునే యువతులకు రూ.2 లక్షల రాయితీ ఇస్తామని పేర్కొంది. సివిల్ సర్వీసు, డిఫెన్స్, ఇతర పోటీ పరీక్షలను మాతృభాషలో నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని దేవెగౌడ తెలిపారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులకు సైకిళ్లు, మోపెడ్లు పంపిణీ చేస్తామని, జిల్లాకు ఒకటి చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెస్తామని తెలిపింది. 12 పాయింట్లతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏడాదిలో 5 ఎల్పీజీ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, గర్భిణులకు ఆరు నెలలపాటు ప్రతి నెలా రూ.6,000 చొప్పున నగదు ఇస్తానని హామీ ఇచ్చింది.
జేడీఎస్ మ్యానిఫెస్టోలో ప్రధానంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేసింది. దీంతోపాటు రైతులను ఆకర్షిస్తోంది. మరోవైపు ఓల్డ్ మైసూర్లో వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంపై జేడీఎస్ దృష్టి సారించింది. ఇక రానున్న ఎన్నికల్లో కమ్యునిస్టులదతో దేవెగౌడ మద్దతు తెలిపారు. కర్నాటకలో మ్యానిఫెస్టోలు, ఇతర వాగ్దానాలను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కులాల ఆధారంగా ఓటర్లు ప్రభావితం అవుతుంటారు. మరి జేడీఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోకు వొక్కళిగలు కాకుండా ఇతర సామాజిక వర్గాల ప్రజలు ఏమేరకు జేడీఎస్‌కు ఓట్లు వేస్తారో తెలియాల్సి ఉంది.