ప్రేమలో పడిన కూతుళ్లు..చంపేసిన తల్లిదండ్రులు
Patna: బిహార్(Bihar)లో దారుణం జరిగింది. కూతుళ్లు ప్రేమలో పడ్డారని చెప్పి తల్లిదండ్రులే దారుణంగా చంపేసారు(honour killings). హాజీపూర్‌కు చెందిన రింకూ దేవి, నరేష్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. అందులో ఒకరు మైనర్. వేరే కులాలకు చెందిన అబ్బాయిలతో వీరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారట. ఈ విషయం రింకూ, నరేష్‌లకు తెలిసింది. కూతుళ్లు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి వస్తుండడంతో అనుమానం వచ్చి ఆరా తీసారు. వారిద్దరూ వేరే కులాలకు చెందిన అబ్బాయిలతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. దాంతో వారిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు. కూతుళ్లు నిద్రలో ఉండగానే దిండ్లతో నొక్కి చంపేసారు. ఉదయం విషయం పోలీసులకు తెలీడంతో ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి రింకూ కూతుళ్ల మృతదేహాల పక్కన కూర్చుని ఉంది. రింకూ భర్త నరేష్ పరారీలో ఉన్నాడు. ముందు తన భర్తే చంపేసాడని చెప్పిన రింకూ విచారణలో ఇద్దరూ చంపారని పోలీసులు స్పష్టం చేసారు. కూతుళ్లు వేరే కులం వారితో ప్రేమలో ఉండడంతో రింకూ, నరేష్‌లు పనిచేస్తున్న కంపెనీలో సూటిపోటి మాటలు అంటున్నారని పోలీసులకు వెల్లడించింది. రింకూను అరెస్ట్ చేసి నరేష్ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.