“నాసా రహస్యాలను పుతిన్‌కు లీక్ చేస్తాడేమో”
NASA: టెస్లా అధినేత.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్ అయిన ఎలాన్ మస్క్.. కొంత కాలంగా రష్యాతో టచ్‌లో ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ఇందులో ఏమాత్రం నిజంలేదని రష్యాకి చెందిన క్రెమ్లిన్, అమెరికాకి చెందిన వైట్ హౌజ్ వారిస్తున్నప్పటికీ.. నాసా చీఫ్ బిల్ నెల్సన్ ఆందోళన చెందుతున్నారు. ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నాసాకు సంబంధించిన కీలక ప్రణాళికలను లీక్ చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 చివరి నుండి మస్క్ అతనితో “నియమిత కాంటాక్ట్”లో ఉన్నారని సమాచారం బయటపడిన నేపథ్యంలో బిల్ నెల్సన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం మస్క్ పుతిన్‌తో “వ్యక్తిగత అంశాలు, వ్యాపార విషయాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతల” గురించి చర్చించాడు అని ప్రచురించింది.
ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే స్పేస్ఎక్స్, నాసా US మిలిటరీకి సన్నిహిత వర్గాలు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం, అమెరికన్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలు మస్క్‌కి తెలిసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం నిజమని తనకు తెలియదని కానీ దీనిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు.