Do Patti Review: క‌వ‌ల‌ల థ్రిల్ల‌ర్ డ్రామా ఎలా ఉంది?

kriti sanon Do Patti Review

Do Patti Review: తెలుగులో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతోనే తొలి సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్న న‌టి కృతి స‌నన్. అది అట్ట‌ర్ ఫ్లాప్ అవ‌డంతో ఆమె ఇక బాలీవుడ్ వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో దోచేయ్ అనే సినిమా చేసిన‌ప్ప‌టికీ అది కూడా ఫ్లాపే. దాంతో టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు కృతి బాలీవుడ్ పీస్ అని అర్థ‌మైపోయింది. ఇక కృతి బాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఎదిగారు. మిమి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. దాంతో ఆమెకున్న క్రేజ్ మ‌రింత పెరిగింది. తాజాగా కృతి డ‌బుల్ రోల్‌లో న‌టించిన దో ప‌త్తి సినిమా రిలీజ్ అయ్యింది. ఇద్ద‌రు క‌వ‌ల ఆడ‌పిల్ల‌ల థ్రిల్ల‌ర్ క‌థ ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా పేరు : దో ప‌త్తి

ద‌ర్శ‌కుడు : శ‌శాంకా చ‌తుర్వేది

నటీన‌టులు : కాజోల్, కృతి స‌న‌న్‌, ష‌హీర్ షేక్

రిలీజ్ డేట్ : 25 అక్టోబ‌ర్

ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్ (అన్ని భాష‌ల్లో ఉంది)

స్టోరీ ఏంటి?

సౌమ్య‌, శైలీ (కృతి స‌న‌న్‌) క‌వ‌ల‌లు. చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోవ‌డంతో పిన్ని చెంత‌కు వెళ్లిపోతారు. సౌమ్య‌కు ఆస్త‌మా ఉండ‌టంతో ఆమెనే ఎక్కువ ప్రేమ‌గా చూస్తారు. దాంతో శైలీ సొంత చెల్లిపై కోపం పెంచుకుంటుంది. క‌ట్ చేస్తే 20 ఏళ్లు గ‌డిచిపోతాయి. సౌమ్య త‌న పిన్నితో క‌లిసి ఉత్త‌రాఖండ్‌లో ఓ షాప్ న‌డుపుతూ ఉంటుంది. ధృవ్ సూద్ (స‌మీర్ షేక్) అనే పారాగ్లైడింగ్ అడ్వెంచ‌ర్ పార్క్ న‌డిపే వ్య‌క్తికి సౌమ్య ప‌రిచ‌యం అవుతుంది. తొలి చూపులో ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇష్ట‌ప‌డిన వాడిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న స‌మ‌యంలో శైలీ ఎంట్రీ ఇస్తుంది. సౌమ్య సంప్ర‌దాయంగా ఉంటే.. శైలీ హాట్ అమ్మాయిగా క‌నిపిస్తుంది. చిన‌ప్ప‌టి నుంచి సౌమ్య త‌న‌కు ఏమీ ద‌క్క‌నివ్వ‌లేదు అన్న కోపంతో ధృవ్‌ను త‌న వ‌శం చేసుకుంటుంది. ధృవ్ తండ్రి ఓ మంత్రి. శైలీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే త‌న జీవితం బాగుండ‌దు.. త‌న‌కు సౌమ్య‌నే క‌రెక్ట్ అని ఫిక్స్ అయిన ధృవ్ మొత్తానికి సౌమ్య‌నే పెళ్లి చేసుకుంటాడు.

Do Patti Review: అది శైలీ జీర్ణించుకోలేక‌పోతుంది. ఎప్పుడెప్పుడు వారిద్ద‌రూ విడిపోతారా అని కాచుకుని కూర్చునేది. ఈ నేప‌థ్యంలో ధృవ్‌కున్న విప‌రీత‌మైన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సౌమ్య‌పై చూపించేవాడు. కోపం వ‌చ్చిన ప్ర‌తీసారి దారుణంగా కొట్టి గాయ‌ప‌రిచేవాడు. కానీ సౌమ్య ఒక్క‌సారి కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌దు. ఇలా ఉండ‌గా.. జ్యోతి (కాజోల్) అనే పోలీస్ అధికారిణి పెట్రోలింగ్ చేస్తుండ‌గా సౌమ్య ఇంటి నుంచి భ‌ర్త కొడుతున్నాడు అనే కాల్ వ‌స్తుంది. తీరా జ్యోతి వెళ్లి చూడ‌గా.. సౌమ్య త‌ల‌కు గాయం ఉంటుంది కానీ తాను బాగానే ఉన్నాన‌ని.. త‌న భ‌ర్త బాగా చూసుకుంటున్నాడ‌ని చెప్తుంది. జ్యోతి పోలీసే కాదు లాయ‌ర్ కూడా. ఎలాగైనా సౌమ్య‌తో కంప్లైంట్ చేయించాల‌ని అనుకుంటుంది కానీ సౌమ్య ఎక్క‌డ కంప్లైంట్ చేస్తే త‌న భ‌ర్త‌ను శైలీ ఎగ‌రేసుకుపోతుందో అని భ‌య‌ప‌డుతుంది.

ఇలా సాగుతున్న క‌థ‌లో మొత్తానికి సౌమ్య త‌న భ‌ర్త ధృవ్‌ను ప‌క్కా ఆధారాల‌తో అరెస్ట్ చేయిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు మౌనంగా ఉన్న సౌమ్య ఉన్న‌ట్టుండి త‌న భ‌ర్త‌ను ఎలా ప‌ట్టించింది? సౌమ్య నాశ‌నాన్ని కోరుకునే శైలీ ఎందుకు సోద‌రికి సాయం చేసింది? అక్కాచెల్లెళ్లు త‌న‌ను వెర్రిదాన్ని చేసారు అని తెలుసుకున్న జ్యోతి చివ‌రికి ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

సినిమా ఎలా ఉంది?

ఒక స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ డ్రామా జోన‌ర్‌ను ఎంజాయ్ చేసేవారు దో ప‌త్తి సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కృతి స‌న‌న్ అమాయ‌కంగా అద‌ర‌గొడుతూనే.. ఓ కంత్రీ ఆడ‌పిల్ల‌లానూ బాగా చేసింది. సినిమా మొత్తం కృతినే హైలైట్. కాజోల్‌కి కూడా పెద్ద‌గా స్క్రీన్ స్పేస్ దొర‌క‌లేదు. సామాజికంగా ఉన్న స‌మస్య‌ను క‌వ‌ల‌ల కాన్సెప్ట్‌కి ముడిపెట్టి సినిమాను తీసారు. పాట‌లు బాగా క్లిక్ అయ్యాయి. మొత్తానికి సినిమా బాగానే ఉంది. ఎంజాయ్ చేయ‌చ్చు.