పుతిన్‌తో ట‌చ్‌లో మ‌స్క్..సాయం చేయ‌ద్ద‌ని చెప్పిన ర‌ష్యా అధ్య‌క్షుడు

elon musk in touch with vladimir putin

Elon Musk: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఇంకో వారం ఉంద‌న‌గా.. ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ గురించి ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్. మ‌స్క్ ఎప్ప‌టినుంచో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టచ్‌లో ఉన్నార‌ని వెల్ల‌డించింది. ఈ విష‌యం అగ్ర‌రాజ్యంలో భ‌గ్గుమంది. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్‌కు మంచి మిత్రుడే. కానీ డ‌మోక్రాటిక్ అభ్య‌ర్ధి అయిన క‌మ‌లా హ్యారిస్ మాత్రం పుతిన్‌కు స‌పోర్ట్‌గా లేదు.  ఈ నేప‌థ్యంలో మ‌స్క్ ట్రంప్‌కి స‌న్నిహితుడైన పుతిన్‌తో ట‌చ్‌లోఉండ‌మేంటి అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌స్క్ ట్రంప్ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం కోట్లు ఖ‌ర్చు పెట్టాడు. ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ట్రంప్‌కి ఓటేయాల‌ని కోరుతున్నాడు. మ‌స్క్ పుతిన్‌తో 2022 నుంచి ట‌చ్‌లో ఉన్న‌మాట వాస్త‌వ‌మే అని అమెరికాతో పాటు ర‌ష్య‌న్ అధికారులు కూడా ధృవీక‌రించార‌ట‌.

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే త‌న మ‌ద్ద‌తు ఉక్రెయిన్‌కే అని చెప్పిన మ‌స్క్ ఇప్పుడు పుతిన్‌తో చొర‌వ ఏంటి అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఉక్రెయిన్‌కు ర‌ష్యా నుంచి స‌మాచారం అందేందుకు మ‌స్క్ కంపెనీ స్టార్‌లింక్ టెర్మిన‌ల్స్ ద్వారా క‌మ్యునికేష‌న్లు కూడా ఏర్పాటుచేసాడు. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు తెలిపే క్ర‌మంలో స్టార్‌లింక్‌కి న‌ష్టాలు వ‌స్తున్న స‌మ‌యంలో మ‌స్క్ మాట మార్చేసాడు. ఈ యుద్ధంలో ర‌ష్యాదే అంతిమ విజ‌యం అనేసాడు. ఈ నేప‌థ్యంలో పుతిన్ నుంచి మ‌స్క్‌కి ఓ రిక్వెస్ట్ కూడా వ‌చ్చింది. తైవాన్ త‌మ‌దే అని ఎప్ప‌టినుంచో మొత్తుకుంటున్న చైనాకు స్టార్‌లింక్ ద్వారా సాయం చేయొద్ద‌ని పుతిన్ మ‌స్క్‌ని కోరాడు. ఈ లింకుల‌పై మ‌స్క్ ఇంకా స్పందించ‌లేదు. మ‌రోప‌క్క ర‌ష్యాకు చెందిన క్రెమ్లిన్, అమెరికాకి చెందిన వైట్ హౌజ్ అబ్బే మాకేం తెలీదు అనేసాయి.