YCPకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై.. అంత మాటనేసిందేంటి?
Vasireddy Padma: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో వికెట్ దిగిపోయింది. వాసిరెడ్డి పద్మ తాజాగా పార్టీకి రాజీనామా చేసారు. పార్టీలో కష్టపడిన వారి కోసం జగన్ ఇప్పుడు గుడ్ బుక్ అంటున్నారని.. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండె బుక్ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జగన్ పార్టీ నేతలతో ఓ సమావేశం ఏర్పాటుచేసారు. ఆ సమయంలో జగన్ ఓ మాటన్నారు. ఎవరైతే సోషల్ మీడియాను బాగా యాక్టివ్‌గా వాడుతూ తమని తాము నిరూపించుకుంటారో వారికి ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది అన్నారు. ఈ మాట వాసిరెడ్డి పద్మకు నచ్చినట్లు లేదు. వారికి ప్రమోషన్ అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదని జీవితాలను, ప్రాణాలను ఫణంగా పెట్టిన కార్యకర్తలను అవసరం లేదనుకున్న జగన్ గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.
పార్టీని నడిపించడంలో పరిపాలన చేయడంలో జగన్‌కు బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని మొన్న ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక అసంతృప్తులు ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసానని.. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలను సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జగన్ ప్రమోషన్ అనగానే ఎక్కడ తనకు మంచి పదవి ఇవ్వకుండా ఇతర నేతలకు ఇస్తారో అన్న భయంతోనే పద్మ రాజీనామా చేసారని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంత నిబద్ధత కలిగిన నాయకురాలైతే ఎన్నికల తీర్పు తర్వాతి రోజే రాజీనామా చేసుండాలని.. అలా కాకుండా జగన్ ప్రమోషన్ అనే పదం వాడిన తర్వాత రాజీనామా ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.